Tuesday, November 10, 2015

గుంటూరు సాక్షిగా మిత్రభేదం

ఏపీలో టీడీపీ, బీజేపీ మైత్రి మూణ్నాళ్ల ముచ్చటగా మారే ప్రమాదం కనిపిస్తోంది. మొదట్లో కేంద్రంపై నమ్మకంగా ఉన్న తెలుగుతమ్ముళ్లు ప్రతిపక్షాల విమర్శల్ని కూడా లెక్కచేయకుండా మోడీని వెనకేసుకొచ్చారు. అయితే శంకుస్థాపనకు వచ్చి పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇవ్వడం అవమానకరమని వారు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా గుంటూరు తమ్ముళ్లు బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
     ఎన్నికలు పూర్తయ్యాక మొదటిగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివిధ కార్యక్రమాల్లో టీడీపీ సర్కారుపై విమర్శలు చేశారు. తర్వాత తెలుగుదేశం నేతలు కూడా దీటుగా స్పందించారు. అయితే మిగతా జిల్లాల నేతల సంగతి ఎలా ఉన్నా.. గుంటూరు నేతలు మాత్రం ఢీ అంటే ఢీ అంటున్నారు. గల్లా జయదేవ్ ప్రధాని పర్యటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా, నర్సరావుపేట ఎంపీ రాయపాటి ఏకంగా ప్రధానిపై ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు.
        బీహార్ ఫలితాల తర్వాత వినుకొండలో పర్యటించిన రాయపాటి.. ఏపీ ప్రజల ఉసురు తగిలే బీజేపీ మట్టిగొట్టుకుపోయిందని ఆరోపించారు. బీహార్, కశ్మీర్ కు ప్యాకేజీ ఇచ్చి, ఏపీకి మట్టి, నీళ్లు ఇవ్వడమేంటని ఆయన నిలదీశారు. బీజేపీ నేతలు ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోవాలని రాయపాటి పరోక్షంగా క్లాస్ పీకారు. రాయపాటి కామెంట్లు టీడీపీలో కలకలం రేపాయి. బీజేపీ నేతల స్పందనపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది. మొత్తానికి గుంటూరు మిర్చి ఘాటు మరిగిన తమ్ముళ్లు.. ఎక్కువకాలం బీజేపీని ఉపేక్షించరనడానికి.. రాయపాటి వ్యాఖ్యలే నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

No comments:

Post a Comment