Wednesday, November 25, 2015

పాఠశాలలు.. నరకానికి నకళ్లు

ఏపీలో పాఠశాలలు నరకానికి నకళ్లుగా తయారయ్యాయి. పుట్టగొడుగుల్లా ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నా.. అధికారులు లంచాలు మరిగి ఇష్టారాజ్యంగా అనుమతులిస్తున్నారు. చిత్తూరు జిల్లాపీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో స్కూలు పైకప్పు కూలి చిన్నారి దుర్మరణం పాలైంది. అధికారుల నిర్లక్ష్యం, యాజమాన్యం అలక్ష్యంతో నిండు నూరేళ్ల జీవితం గడపాల్సిన చిన్నారి కన్నుమూసింది.
             గుర్రంకొండలో ఇండియన్ పబ్లిక్ స్కూల్లో అప్సర అనే చిన్నారియూకేజీ చదువుతోంది. క్లాస్ రూంలో పాఠాలు చదువుతుండగా. ఉన్నట్లుండి పైకప్పు కూలింది. దీంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. అయితే పైకప్పు కూలి నేరుగా అప్సర తల మీద పడటంతో.. బలమైన గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించినా.. చికిత్స చేస్తుండగానే అప్సర మరణించింది.
            అధికారులు సరిగ్గా తనిఖీలు చేయకుండా శిధిల భవనాల్లో స్కూళ్లకు అనుమతులు ఇవ్వడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. కలెక్టర్ సెలవు ప్రకటించినా స్కూల్ ఎందుకు నడుస్తుందో యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ స్కూళ్లే నయమని ఎంతో ఆశతో చదివిస్తున్న తల్లిదండ్రులకు.. అధికారుల నిర్లక్ష్యం తీరని శాపంగా మారింది. 

No comments:

Post a Comment