Saturday, November 21, 2015

చేయూతలో కోత

ఆపదలో అన్నదాతను ఆదుకోవడానికి సర్కారుకు చేతులు రావడం లేదు. కనీసం బీమా సంస్థపై ఒత్తిడి తెచ్చి పరిహారం ఇప్పించడానికి కూడా మనసొప్పడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాల దెబ్బకు సర్వం కోల్పోయిన అన్నదాతలకు.. బీమా సంస్థ పరిహారంలో కోత పెడుతోంది. కొన్నిచోట్లైతే అసలు పరిహారమే ఇవ్వకుండా ఎగ్గొడుతోంది. పరిహారాన్ని నిర్థారించే కమిటీల్లో టీడీపీ నేతలకు చోటు దక్కడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
                సవరించిన పంటల బీమా పథకం ప్రకారం విపత్తుల సమయంలో తక్షణ పరిహారంగా ఇరవై ఐదు శాతం పరిహారం చెల్లించాలి. తర్వాత పూర్తిస్థాయి నిర్థారణ జరిగాక గ్రామం యూనిట్ గా తీసుకున్నప్పుడు.. మిగతా పరిహారాన్ని చెల్లించాలి. ఇవీ ఉన్న మార్గదర్శకాలు. తర్వాత కూడా ఇరవై ఐదు శాతం కంటే తక్కువ పరిహారం ఇచ్చినా.. రైతు నుంచి తిరిగి వసూలు చేయకూడదని నిబంధనలున్నాయి.
             కానీ బీమా సంస్థలు రైతుల నుంచి వసూలు చేసే ప్రీమియంలు మాత్రం పెంచుతూ.. విపత్తులు వచ్చినప్పుడు ముఖం చాటేస్తున్నాయి. గతంలో నీలం, హుదూద్, హెలెన్ తుపానులప్పుడు 25 శాతం తక్షణ పరిహారాన్ని ఎగ్గొట్టిన సంస్థలు.. ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నాయి. అదేమంటే పనల మీద ఉండే పంటకు పరిహారం తర్వాత వస్తుందని.. ఇప్పుడు రాదని కుంటిసాకులు చెబుతున్నారు. పరిహార నిర్ధారణ కమిటీలో అధికార పార్టీ నేతలు ఉన్నా.. బీమా సంస్థపై ఒత్తిడి తేవడం లేదని విమర్శలు వస్తున్నాయి. 

No comments:

Post a Comment