Friday, November 13, 2015

అంగన్ వాడీ కేంద్రాలకు సర్కారు కోతలు

మాతాశిశు సంరక్షణలో కీలక పాత్ర పోషించే అంగన్ వాడీ కేంద్రాల విషయంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు రకరకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలావరకు అంగన్ వాడీలే అన్ని అవసరాలు తీరుస్తుంటారు. అలాంటి అంగన్ వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరా సర్కారు సగానికి సైతం కోత విధించింది. అదేమంటే పెరిగిన పప్పుల ధరలను కారణంగా చూపింది. సర్కారు నిర్ణయంతో తూర్పుగోదావరి జిల్లాలోని చిన్నారులు ఆకలితో అలమటిస్తారని ఆందోళన వ్యక్తమౌతోంది.
         అంగన్ వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణీలు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం ఇస్తారు. మూడేళ్ల వరకు చిన్నారులకు మూడు కేజీల బియ్యం, కిలో కందిపప్పు ఇస్తారు. మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులను అంగన్ వాడీ కేంద్రాల్లో చేర్చుకుని విద్యాబుద్ధులు నేరతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తారు. అయితే ఇప్పుడు కందిపప్పు ధర పెరిగిందనే సాకుతో అరకేజీ కోత విధించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
             విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు రేపటి పౌరులను బలహీనులుగా తయారుచేస్తున్నారని మండిపడుతున్నారు. పిల్లలకు అన్నం కూడా పెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు బీదఅరుపులు అరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ టూర్లు, ప్రత్యేక విమానాలు అంటూ అనవసర ఖర్చు చేసే చంద్రబాబు.. చిన్నారుల నోటి దగ్గర కూడు లాగేయడం దౌర్భాగ్యమని విమర్శిస్తున్నారు.

No comments:

Post a Comment