Tuesday, November 10, 2015

స్కూళ్ల నిధులు లాక్కున్న సర్కారు

అనంతపురం జిల్లాలో ఎక్కడా లేని చోద్యం జరిగింది. స్కూళ్లకు మరిన్ని నిధులిచ్చి ఆదుకోవాల్సిన సర్కారు.. తేరగా వాటి నిధులే మింగేసింది. పైగా నిధులు ఖర్చుచేయలేదని కుంటిసాకులు చెబుతోంది. సర్కారు ఇచ్చిన నిధులతో పాటు, వాటిపై వచ్చిన వడ్డీ కూడా లాగేసుకోవడంపై ఉపాధ్యాయసంఘాలు మండిపడుతున్నాయి. ఆర్భాటంగా ప్రకటనలు చేసే ప్రభుత్వ పెద్దలు ఆచరణలోకి వచ్చేసరికి దివాలాకోరు పద్ధతులకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
        ప్రతి స్కూలుకు స్కూల్ ఖర్చులు, కరెంట్ బిల్లు, సిబ్బంది జీతాల కోసం సర్కారు రెండు గ్రాంటులు ఇస్తోంది. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలకు గ్రాంట్లు ఇచ్చారు. అయితే చాలా పాఠశాలలు ఇంకా ఈ నిధులను వాడుకోలేదు. ఇదే అదనుగా భావించిన స్కూళ్లకు సమాచారం లేకుండా స్కూల్ ఖాతాలో ఉన్న నిధులను వెనక్కితీసుకుని, ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ అధికారి ఖాతాకు జమ చేసింది. ఈ విషయం తమకు కూడా తెలియదని ఎస్ఎస్ఏ అధికారి చెప్పడం ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోంది.
       అధికారులకు కూడా తెలియకుండా నేరుగా బ్యాంకులతో మాట్లాడి 25 కోట్ల నిధులు వెనక్కుతీసుకోవడంపై జిల్లాలో నిరసన వ్యక్తమౌతోంది. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులంతా స్కూళ్లలో మరుగుదొడ్లు, తాగునీటి పంపులు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని చెబుతుంటే.. వాటి కోసం ఇచ్చిన నిధులను కూడా లాక్కోవడమేంటని ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే కనునిప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment